ఇటీవలి కాలంలో చైనా చొరబాట్లు అధికం కావడంతో భారత్ కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి గస్తీని ముమ్మరం చేసింది. పనిలో పనిగా.. వందలాది తేలికపాటి యుద్ధ టాంకులను భారత సైన్యం సరిహద్దుల వెంట మొహరించనుంది. అటు పాకిస్థాన్, ఇటు చైనాలు అవకాశం దొరికినప్పుడల్లా మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
ఈ దుష్ట శక్తుల చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు యుద్ధ టాంకులను సరిహద్దు పొడవున మొహరించేందుకు రక్షణ శాఖ తీర్మానించింది. ఈ తేలికపాటి యుద్ధ టాంకులు 22 టన్నుల సామర్థ్యంతో 3,000 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వత శ్రేణుల్లో తేలికగా మొహరించవచ్చు. ఈ ట్యాంకులను జమ్మూ-కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం సరిహద్దు ప్రాంతాల్లో మొహరిస్తారని రక్షణ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం సిక్కిం పర్వత ప్రాంతాల్లో చైనాకు సరిహద్దులో 'ఫింగర్ ఏరియా'లో యుద్ధ ట్యాంకులను మొహరించారు. 1980 నుంచి టీ-72, టీ-55 యుద్ధ ట్యాంకులను ఫింగర్ ఏరియాలో మొహరించినట్టు అధికారులు వెల్లడించారు. చైనా సైనికులు మన భూభాగంలోకి కొన్ని కిలోమీటర్లు అక్రమంగా చొరబాటు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. దీంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది.