భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ జి.మాధవన్‌నాయర్ అంతర్జాతీయ ఖగోళశాస్త్ర అకాడమీ (ఐఏఏ) అధ్యక్షునిగా నియమితులైనారు.
ఇస్రో ఛైర్మెన్ జి. మాధవన్‌నాయర్ ఐఏఏ అధ్యక్షునిగా నియమితులైనారు. గత నాలుగు సంవత్సరాలుగా ఐఏఏ శాస్త్రీయ కార్యకలాపాల విభాగం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నాయర్‌ను అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తూ దక్షిణ కొరియాలోని ఐఏఏ సమావేశంలో ఆదివారం నాయర్ పదవిని చేపట్టారని ఇస్రో సోమవారం తెలిపింది.
ప్రతిష్టాత్మక చంద్రయాన్-1తోపాటు నాయర్ నాయకత్వంలో ఇస్రో 25 ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించింది. ఇస్రోలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న నాయర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌తోపాటు వివిధ హోదాల్లో పని చేశారు.
ఇదిలావుండగా ఐఏఏలో 85 దేశాలకు చెందిన 1,200 మంది సభ్యులుగా ఉన్నారు. ఇది ఓ స్వతంత్ర సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనల్లో విశేష కృషిని కనబరిచినందులకు ఇందులో సభ్యులుగా ఎన్నుకుంటారు.
కాగా ఐఏఏ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి భారతీయ అంతరిక్ష పరిశోధకునిగా నాయర్ చరిత్ర సృష్టించారు.