తమిళనాడు రాష్ట్రానికి చెందిన పళ్ళిపట్టు పట్టణం రాధానగర్‌లోని ఓ బాణాసంచా గోడౌన్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 32 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం. ఆస్తి నష్టం పదిలక్షలపై మేరకే ఉండొచ్చని ప్రాథమిక అంచనా. మృతుల్లో దాదాపు 27 మందికిపైగా చిత్తూరు జిల్లాకు చెందినవారేనని అధికారులు తెలిపారు.
ఇక్కడ ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకు పోలీసులు గానీ, అగ్ని మాపక సిబ్బందిగాని స్పందించకపోవడంతో విషయం బయటి ప్రపంచానికి తెలియరాలేదు. బాణాసంచా గొడౌన్ వద్ద అగ్ని ప్రమాద నివారణకు కావలసిన జాగ్రత్తలు యాజమాన్యం పాటించకపోవడంవల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
గోడౌన్‌కు వున్న ద్వారం వద్ద ముందుగా అగ్ని ప్రమాదం జరగడంతో లోపలి వ్యక్తులు అలాగే వుండిపోవడంతో ఎక్కువ మంది అగ్నికి ఆహుతైనట్టు సమాచారం. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు శుక్రవారం అర్థరాత్రి వరకు తెలియరాలేదు.
ఇదిలావుండగా ఆంధ్రా నుంచి టపాసులు కొనుగోలుకు వెళ్ళిన వారు తమతో పాటు వచ్చిన వారు కనిపించడం లేదంటూ రోధిస్తుండటం కనిపించింది. దీంతో మృతుల సంఖ్య ఎక్కువగానే వుంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. 108 వాహనం ద్వారా మృతదేహాలను తమిళనాడులోని తిరుత్తణిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కాగా ఇక్కడ జరిగిన అగ్నిప్రమాదం కేవలం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వైఫల్యమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ళకు తలొగ్గిన అధికారులు అగ్నిప్రమాదాల నివారణ కోసం బాణాసంచా వ్యాపారాలు నిర్వహించే ప్రదేశాలలో ఎలాంటి చర్యలు తీసుకోక పోయినా పట్టించుకోకుండా విచ్చలవిడిగా లైసెస్సులు ఇచ్చారని, మోతాదుకు మించి ఇరుకైన గోడౌన్లలో టపాసులు నిల్వవుంచారని పలువురు ఆరోపిస్తున్నారు.