మధురకు సమీపంలో గోవా, మేవార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్న సంఘటనలో సుమారు 15 మందికి పైగా ప్రయాణీకులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా ప్రయాణీకులు బోగీల్లో చిక్కుకుని ఉన్నారు. ఈ రోజు ఉదయం 4.45 గంటల సమయంలో మధురకు సమీపంలోని బజ్నా వంతెన వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
మధురకు సమీపంలోని అగి ఉన్న మేవార్ ఎక్స్‌ప్రెస్‌ను.. వేగంగా వచ్చిన గోవా క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఢీ కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలతో రంగంలోకి దిగారు.
సీపీఆర్ఓ నార్త్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే అధికారి రాజేష్ వాజ్‌పేయ్ మాట్లాడుతూ, మేవార్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ కంపార్ట్‌మెంట్ బాగా దెబ్బతిన్నట్లుగా తెలిపారు. గాయపడ్డ ప్రయాణీకలను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. దెబ్బతిన్న బోగీల నుంచి ప్రయాణీకులను రక్షించేందుకు గ్యాస్ కట్టర్‌లను ఉపయోగిస్తున్నారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందన్నారు.