ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మావోయిస్టులు మా అనుబంధ సభ్యులు కాదు: కారత్ (Maoists | Center | Operation | Bengal | Prakash Karath | CPM | UPA)
హింసామార్గం మినహా మరో కార్యాచరణ ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న మావోయిస్టులు తమ అనుబంధ సభ్యులు లేదా పార్టీ కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. వర్గ శత్రువులు ఎవరో కూడా గుర్తించలేని విధంగా మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ వామపక్ష భావజాల పార్టీ కాబోదన్నారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మావోయిస్టులను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఒంటరి చేయడానికి తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బెంగాల్లో మావోయిస్టులకు తగిన గుణపాఠం చెప్పడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
బెంగాల్ రాష్ట్రంలో మావోయిస్టు చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతాం. ఈ పని కేవలం పోలీసు శాఖ మాత్రమే చేయలేదు. ప్రజలను సమీకరించడం ద్వారా వారిని మావో చర్యలకు అడ్డుకట్ట వేస్తామని కారత్ స్పష్టం చేశారు. అలాగే, దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా మారి, హింసాయుత కార్యక్రమాలకు పాల్పడుతున్న మవోలను ఏరివేసేందుకు కేంద్రం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టడంలో తప్పేమి లేదని కారత్ తేల్చిచెప్పారు.
శాంతి భద్రతల సమస్యకే పరిమితం కాకుండా, మావోయిస్టుల పెరుగుదలకు ఉపకరిస్తున్న పరిస్థితులపైనా కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్ళకు తలొగ్గుతోందని ఆరోపించారు. సంపన్నులకు మేలు చేసే ఆర్థిక విధానాలన దేశ ప్రజలపై బలంవంతంగా రుద్దేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రయత్నిస్తున్నారన్నారు.