జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్‌తో సహా రాష్ట్రంలోని అన్నివర్గాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అయితే, పాకిస్థాన్ తన గడ్డపై నుంచి తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థల పని పట్టాల్సిందేనని ఆయన నొక్కివక్కాణించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉదయం జమ్మూకాశ్మీర్‌కు చేరుకున్న ప్రధాని తొలుత అనంతనాగ్-కాజీగుండ మధ్య రైలు మార్గాన్ని ప్రారంభించారు. దేశంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన రైలుమార్గం ఇదే కావడం గమనార్హం. ఈ కార్యక్రమలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో సహా కేంద్ర మంత్రులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. హింసకు స్వస్తిపలికి, ఆయుధాలు వీడితో ఎవరితోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పాక్‌తో సహా కాశ్మీర్ లోయలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
మానవతాదృక్ఫథంతో కూడున్న అంశాలపై పొరుగు దేశంతో చర్చలకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. అదే పాక్ గడ్డపై ఉన్న తీవ్రవాద స్థావరాలను ఆదేశం ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కాశ్మీర్‌లో తీవ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడకుండా అడ్డుకట్ట వేయాలన్నారు.
తన గడ్డపై ఉన్న తీవ్రవాద సంస్థలపై పాక్ చర్యలు తీసుకుంటుందనే ఆశాభాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంలో పాక్ చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. తన పిలుపు ఓ బలహీనతగా భావించకుండా, గట్టిగా స్వీకరించారని కోరారు. అంతేకాకుండా, రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడే గ్రూపులతో కూడా ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు మన్మోహన్ సింగ్ తెలిపారు.