ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » హైదరాబాద్ నోవోటెల్ వైపు కర్ణాటక రాష్ట్ర "గాలి" (Hyd | Novotel | Karnataka | Yadyurappa | Gaali Brothers | Flood | Arun Jaitly)
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గాలి సోదరులు సీఎంను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం తమ డిమాండ్‌కు ససేమిరా అంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరించారు.
పనిలో పనిగా తమ అనుచరులను ఏకంగా హైదరాబాద్‌కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉన్న నోవోటెల్ నక్షత్ర హోటల్‌లో మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. వీరితో రహస్య మంతనాలు జరిపేందుకు గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన సోదరుడు కరుణాసాగర్ రెడ్డిలు నోవోటెల్‌లో బస చేస్తున్నట్టు వినికిడి.
అయితే, గాలి సోదరుల సన్నిహిత వర్గాల మేరకు నోవోటెల్ హోటల్‌లో 15 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారని, మరో 11 మంది సభ్యులు గురువారం సాయంత్రం గోవాకు చేరుకుంటారని చెపుతున్నారు. అలాగే, ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మిగిలిన ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు గాలి సోదరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అరుణ్ జైట్లీని బెంగుళూరుకు పంపిన కమలనాథులు గురువారం సాయంత్రం సుష్మా స్వరాజ్‌ను కూడా పంపనున్నారు.
ఇటీవల కర్ణాటకలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడంలో యడ్యూరప్ప పూర్తిగా విఫలమయ్యారని గాలి సోదరులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వారికి తాము సాయం చేస్తామన్నా ముఖ్యమంత్రి అడ్డు చెపుతున్నారని గాలి బ్రదర్స్ ధ్వజమెత్తారు. అందుకే తిరుగుబాటు బావుటా ఎగురవేసినట్టు ఆయన అనుచరులు చెపుతున్నారు.