ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మావోయిస్టులకు రక్షణ కవచంగా మమత: బుద్ధదేవ్ (West Bengal | Buddhadeb Bhattacherjee | Communist Party of India-Marxist | Maoist rebels | October 27)
రాజధాని ఎక్స్‌ప్రెస్ హైజాక్ వ్యవహారంపై మమతా బెనర్జీ వైఖరిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ తప్పుబట్టారు. మావోయిస్టులకు షీల్డు కవరుగా రైల్వేమంత్రి ప్రవర్తించడంపై మండిపడ్డారు. రైలు హైజాక్ చేసినవారితో చర్చలు జరుపుతామంటూ మమత ప్రకటించడం ద్వారా ఆమె నేతృత్వంలో రైల్వే శాఖ ఎంత బలహీనంగా ఉందో తెలియజెప్పారన్నారు.
అక్టోబరు 27వ తేదీన రాజధాని ఎక్స్‌ప్రెస్ హైజాక్‌కి పాల్పడిన నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొనకపోవడం రైల్వే పోలీసుల అసమర్థతను తెలియజేస్తోందన్నారు. రైలును హైజాక్ చేయడం వెనుక ఓ ముఠా హస్తం ఉన్నదని, మావోయిస్టుల పేరును ప్రస్తావించకుండా సీఆర్పీఎఫ్ తమ ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. హైజాక్‌కు పాల్పడినవారు ఎవరో తమకు తెలియదని చెప్పడం రైల్వే పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందన్నారు.
ఈ వ్యవహారం చూస్తుంటే రైల్వే శాఖ మావోయిస్టులకు రక్షణగా నిలుస్తూ వారిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. మావోయిస్టులతో చేతులు కలిపి వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తృణమూల్ కాంగ్రెస్ యోచన చేస్తున్నదనీ, అయితే వారిని తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని బుద్ధదేవ్ వ్యాఖ్యానించారు.