ఉత్తరప్రదేశ్ లక్నోలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడిక్కడే మృతి చెందగా చాలామందికి తీవ్రగాయాలైనాయి.
లక్నోలోని గోండా ప్రాంతంలోనున్న మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గోరఖ్‌పుర్- అయోధ్యా మధ్య నడుస్తున్న రైలును ఓ ట్రక్కు ఢీకొంది. ప్రమాదం జరగడంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. అలాగే చాలామందికి తీవ్ర గాయాలైనట్లు లక్నో డీఆర్ఎమ్ అశోక్ సింగ్ తెలిపారు.
ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ట్రక్కు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద గేటు ఏర్పాటు చేయమని తాము రైల్వే అధికారులను చాలాసార్లు కోరామని, రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ గేటు నిర్మించి, సిబ్బందిని నియమించివుంటే ఈ ఘోర ప్రమాదం జరిగివుండేది కాదని స్థానికులు వాపోయారు.