కర్ణాటక రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. నాయకత్వ మార్పిడి జరిగి తీరాల్సిందేనని గాలి బ్రదర్స్ పట్టుబట్టారు. మొన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన వీరిద్దరు ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు.
పార్టీ అగ్రనేతలతో సమావేశమైన వీరిద్దరు ముఖ్యమంత్రి యడ్యూరప్పను మార్చాల్సిందేనని మరోమారు పట్టుబట్టినట్టు సమాచారం. సీఎంను తొలగించి, ఆయన స్థానంలో స్పీకర్ జగదీష్ షెట్టర్‌ను నియమించే వరకు ఢిల్లీ నుంచి కదలబోమని తేల్చి చెప్పారు.
అయితే పార్టీ నాయకత్వాన్ని మార్చబోమని అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో కర్ణాటక మంత్రి, అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి చేరుకుని, తమ చర్యలను ముమ్మరం చేశారు. వీరి వెంట అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో సీనియర్ నేత అనంత కుమార్ నివాసంలో గాలి బ్రదర్స్‌తో మరో సీనియర్ నేత అరుణ్ జైట్లీ సమావేశం కానున్నారు. వీరిమధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. వరద బాధితులకు సాయం చేసేందుకు గాలి బ్రదర్స్ ముందుకు వచ్చారు.
ఇదే జరిగితే ఉత్తర కర్ణాటకలో గాలి బ్రదర్స్‌కు ఎదురులేకుండా పోతుందని భావించిన సీఎం యడ్యూరప్ప వారికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించగా పావులు కదిపారు. ఫలితంగా కర్ణాటక రాష్ట్ర భాజపా సర్కారులో సంక్షోభం నెలకొంది. దీన్ని పరిష్కరించేందుకు అధిష్టానం ఎన్ని రకాల బుజ్జగింపులు చేసినా సత్ ఫలితాన్ని ఇవ్వలేదు.