స్వైన్ ఫ్లూ మహమ్మారి దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నా పూణెలో మాత్రం రోజురోజుకూ మరింతగా ప్రబలుతోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 29 సంవత్సరాల వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించినట్టు స్థానిక వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో పూణెలో మృతుల సంఖ్య 97కు చేరుకుంది.
పూణెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాఘోలి అనే ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తికి గత ఆదివారం ఈ వైరస్ సోకింది. వెంటనే ఆయన్ను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ససూన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈయనకు గత నెల 30వ తేదీన జరిగిన వైద్య పరీక్షల్లో హెచ్1ఎన్1 వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు.