ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బయట నుంచి మద్దతుకు సిద్ధం: ఎన్సీపీ నేత భుజ్‌బల్ (Maharashtra | Ashok Chavan | Chhagan Bhujbal | NCP | Congress | SSJamir)
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి చగన్ భుజ్‌బల్ తెలిపారు. అలాగే, మంత్రివర్గం కూర్పుపై తాము డిమాండ్లను పరిష్కరించిన రోజున ప్రభుత్వంలో చేరుతామని ఆయన మంగళవారం స్పష్టం చేశారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి అశోక్ చవాన్, ఎన్సీపీ నేత చగన్ భుజ్‌బల్ నేతలతో ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్ఎస్.జమీర్ వేర్వేరుగా సమావేశమై, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం భుజ్‌బల్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
అయితే, ఇది ఏమేరకు స్థిరంగా ఉంటుందో వారికే తెలియాలి. తమ అభిప్రాయాలను, డిమాండ్లను గవర్నర్‌కు తెలియజేశాం. మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భుజ్‌బల్ అన్నారు. ఎపుడైతే మంత్రిత్వ శాఖల కేటాయింపు ఓ కొలిక్కి వస్తుందో ఆపుడే తాము ప్రభుత్వంలో చేరుతామని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఎన్సీపీ చేతుల్లో ఉన్న ఆర్థికం, హోం, ప్రజాపనులు, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఆర్థికం, హోం, స్పీకర్, విద్యుత్, పట్టణాభివృద్ధి శాఖలను కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే, ఎన్సీపీ మాత్రం 1999 ఫార్ములాను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తుండగా, దీనికి మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ససేమిరా అంటోంది. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటులో సంక్షోభం నెలకొంది.