ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » యడ్యూరప్ప సీఎంగా కొనసాగే ఛాన్సే లేదు (Bharatiya Janata Party | Karnataka | Chief Minister | BS Yeddyurappa | Rajnath Singh | G Karunakara Reddy | G Janardhana Reddy)
కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగుతారని భాజపా కేంద్ర అధినాయకత్వం చెపుతుంటే ఆ రాష్ట్ర రెవిన్యూమంత్రి అసమ్మతి నేత గాలి కరుణాకర్ రెడ్డి ఆయన సోదరులు మాత్రం తమకు ఆ విషయం తెలియదంటున్నారు. అసలు రాజ్‌నాథ్ తమతో అలా చెప్పలేదని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని మీడియాయే ప్రచారం చేసింది తప్ప ఆయన అలా చెప్పలేదని పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ రోజు తాము సుష్మా స్వరాజ్‌తో ఎందుకు సమావేశమవుతామని ప్రశ్నించారు.
ఇదిలావుంటే సోమవారం రాత్రి పొద్దుపోయాక రాజ్‌నాథ్ చుట్టూ గుమిగూడిన విలేకరులు "యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారా..?" అని ప్రశ్నించినపుడు ఆయన హిందీలో "బిల్‌కుల్.. బిల్‌కుల్" అని మాత్రమే అన్నారు. ఈ మాటలను మీడియా భూతద్దంలో చూపించి పెద్దది చేసిందని కరుణాకర్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
యడ్యూరప్పను గద్దె దింపడమే తమ ధ్యేయమనీ, ఈ నిర్ణయంలో ఎటువంటి మార్పులేదనీ స్పష్టం చేశారు. కర్నాటకలో భాజపా 50 ఏళ్లపాటు పరిపాలించాలంటే తక్షణమే యడ్యూరప్పను ముఖ్యమంత్రి పీఠంపై నుంచి తొలగించాలని "గాలి" సోదరులు మరోమారు స్పష్టం చేశారు. తమ అభ్యర్థనను అధిష్టానం పరిశీలిస్తోందని వెల్లడించారు.