ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ "గ్రీన్‌హంట్" ప్రారంభం! (Naxals | Moists | Green Hunt | Operation | Govt | Orissa | Jarkhand | Bengal)
దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిన మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌హంట్ ఆపరేషన్ కౌంట్‌డౌన్ ఆరంభమైంది. మావోయిస్టులకు కేంద్ర స్థావరంగా ఉన్న అబూజ్‌మడ్‌పై పట్టు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
దేశంలో నక్సల్స్ కార్యకలాపాలను పూర్తిగా తుడిసి వేసేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను వీడిన నక్సల్స్ ఆ తర్వాత జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఇకపై వీరి ఆటలు సాగకుండా గట్టి గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ఈ తాజా ఆపరేషన్ వల్ల నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో దాడులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, మావోయిస్టు గెరిల్లాలను ఎదుర్కొనేందుకు కోబ్రా దళాలను అబూజ్‌మడ్‌లో ఆపరేషన్ కోసం రంగంలోకి దించింది. ఆపరేషన్‌కు 40 వేల మంది పారామిలటరీ దళాలు, సైనిక హెలికాఫ్టర్లను పెద్దసంఖ్యలో వినియోగించనుంది.
వీటితో పాటు.. నక్సలైట్ల ఆచూకీ తెలుసుకునేందుకు అంతరిక్ష పరిశోధనా సంస్థ, జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈ సంస్థలు ఇప్పటికే శాటిలైట్ చిత్రాలను, వీడియో మ్యాపులను సిద్ధం చేశాయి.
అత్యంత అధునాతమైన మైన్‌ప్రూఫ్ వాహనాలు సిద్ధమయ్యాయి. హెలికాఫ్టర్లపై మావోయిస్టులు గ్రెనేడ్లతో దాడులు చేసే అవకాశం ఉన్నందుకు భూమికి వెయ్యి అడుగుల కంటే కిందకు దిగరాదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అబూజ్‌మడ్‌ను కేంద్రంగా చేసుకుని నలువైపుల నుంచి ఏకకాలంలో దాడులు జరిపేందుకు కేంద్ర పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది.