జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించరాదని జమాయిత్ ఎ ఉలేమా హింద్ (జేఈయూ) తన సమక్షంలో ఎలాంటి తీర్మానం చేయలేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అసలు ఇలాంటి తీర్మానం చేసినట్టు తనకేమాత్రం తెలియదని ఆయన బుధవారం విడదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవ్‌బండ్‌లో జమాయిత్-ఎ-ఉలేమా హింద్ (జెఈయు) 30వ జాతీయ సమావేశం జరిగింది. ఇందులో ముస్లింలు వందేమాతరం జాతీయ గీతాన్ని ఆలపించ రాదని, ఆ గీతంలో కొన్ని పదాలు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయని పలువురు జెఈయు నాయకులు వెల్లడించారు. ముస్లింలా బోర్డు సైతం జెఈయూ చర్యను సమర్థించింది. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మంగళవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సమావేశానికి చిదంబరం పాల్గొన్నారు. ఆ సమయంలోనే వందేమాతరంపై తీర్మానం చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై వివాదం చెలరేగడంతో చిదంబరం వివరణ ఇచ్చారు. వందేమాతరం లేదా మహిళా రిజర్వేషన్ అంశాలపై వారు తీర్మానం చేసినట్టు నాకెలాంటి సమాచారం లేదన్నారు.