మహారాష్ట్ర సర్కారు ఏర్పాటులో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. ఇరు పార్టీలు తమ మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో శుక్రవారం రెండు పార్టీల సారథ్యంలో మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటు కానుంది.
ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ... "కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య మంత్రి పదవుల వ్యవహారంలో తలెత్తిన బేధాలు పరిష్కారమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి పదవిని కూడా ఆ పార్టీకే కట్టబెడుతున్నాం. అదేవిధంగా ఒక్కో పార్టీ నుంచి సుమారు 20 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది" అన్నారు
288 అసెంబ్లీ స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ 82 స్థానాలను గెలుచుకోగా, ఎన్సీపీ 62 సీట్లను కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో తమకే కీలక మంత్రి పదవులు కావాలని ఇరు పార్టీలు పట్టుబట్టడంతో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి విదితమే.
ఇదిలావుండగా మహారాష్ట్ర గవర్నర్ జమీర్ మంగళవారం కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. గవర్నర్ భేటీ అయిన తర్వాత ఇరు పార్టీలు తమ ధోరణిని మార్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖతను వ్యక్తం చేశాయి.
అంతకముందు భాజపా-శివసేన కూటమి మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది.