ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జేడీయూ పోటీ (BJP | JD-U | Jharkhand | Assembly Polls | Congress | JMM | Sibu Soren)
త్వరలో జరుగనున్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యు)లు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
మొత్తం 81 స్థానాలు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో జేడీయూ 14 చోట్ల పోటీ చేయనుంది. మిగిలిన చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం భాజపా-జేడీయులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, కర్ణాటకలో అధికార మార్పిడి ఉండబోదని స్పష్టం చేశారు.
దీనిపై భాజపా ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ..జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో జరిగిన పొత్తు చర్చలు ఫలించాయని చెప్పారు. ఇరు పార్టీల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం మేరకు 14 స్థానాల్లో పోటీ చేసేందుకు జేడీయూ అంగీకరించిందని చెప్పారు.
ఇదిలావుండగా, జేడీయూ పార్టీ 19 సీట్లకు అభ్యర్థులను బుధవారం ప్రకటించడం గమనార్హం. ఒక రోజు తర్వాత భాజపా 58 సీట్లకు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. అయితే, గురువారం ఇరు పార్టీ నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించి సీట్ల ఒప్పందం కుదిరింది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.