కర్ణాటక రాష్ట్ర రాజకీయం మరింత రసదాయకంలో పడింది. ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పను మార్చే ప్రసక్తే లేదని కమలనాథులు తేల్చి చెప్పారు. దీంతో అమీ తుమీ తేల్చుకునేందుకు తరుగుబాటు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా, మంత్రులు గాలి బ్రదర్స్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ లేఖలను తమ శిబిరం నేత గాలి జనార్ధన్ రెడ్డికి అందజేశారు.
ముఖ్యమంత్రి యడ్యూరప్పను పీఠం నుంచి దించివేయాలనే పట్టుదలతో కంకణం కట్టుకుని రాజకీయాన్ని నడుపుతున్న పవర్‌ఫుల్ బళ్ళారి సోదర త్రయం గాలి జనార్ధన రెడ్డి ఆయన సోదరుడు గాలి కరుణాకర రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డిలు భాజపా అధిష్టానానికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా తొలగించి ఆయన స్థానంలో గాలి జనార్ధన రెడ్డికి సన్నిహితుడైన అసెంబ్లీ స్పీకర్ జగదీష్ షెట్టర్‌ను నియమించాలని ప్రధాన షరతు విధించిన విషయం తెల్సిందే.
దీనికి భాజపా అగ్రనేతలు ససేమిరా అంటున్నారు. దీంతో గాలి శిబిరంకు చెందిన 57 మంది భాజపా ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు బదులుగా తిరుగుబాటుకు సారథ్యం వహిస్తున్న గాలి జనార్ధన రెడ్డికి సమర్పించారు.