మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వం శనివారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్‌తో పాటు.. ఇరు పార్టీలకు చెందిన కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీఎల్పీ నేత అశోక్ చౌహాన్ శుక్రవారం స్పష్టం చేశారు.
అయితే, మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఆయన వివరించేందుకు నిరాకరించారు. ఇదిలావుండగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అశోక్ చౌహాన్‌తో పాటు ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్‌లు చివరిదఫాగా గవర్నర్ జమీర్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. దీనిపై చౌహాన్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు గవర్నర్‌ను కలుసుకోనున్నట్టు చెప్పారు.
గత నెల 23వ తేదీన వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 288 సీట్లకు కాంగ్రెస్ పార్టీ 82, ఎన్సీపీ 62 సీట్లలో విజయం సాధించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత స్థానంలో భాజపా 46, శివసేన 44, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన 13 సీట్లను కైవసం చేసుకోగా మిగిలిన సీట్లలో చిన్నా చితక పార్టీలు కైవసం చేసుకున్నాయి.