బలపరీక్షలో తమకు మద్దతుగా నిలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా మంత్రిపదవులతో సత్కరించారు. తమ ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగించడమే కాకుండా, మరో నాలుగేళ్ళ తర్వాత తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడమే ధ్యేయంగా పావులు కదిపారు. ఫలితంగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులను మంత్రిపదవులతో స్థానం కల్పించారు.
హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భూపీందర్ సింగ్ హూడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 40 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఏడు సీట్లు తక్కువకాగా, హూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఏడుగురు స్వతంత్రులు ముందుకు వచ్చారు.
దీంతో హూడా నేతృత్వంలో మరోమారు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. హూడా అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోగా, స్వతంత్రుల మద్దతుతో గట్టెక్కింది. ఈ పరిస్థితుల్లో హూడా తన మంత్రివర్గాన్ని శనివారం విస్తరించారు. ఇందులో ఏడుగురు స్వతంత్రులతో పాటు.. సొంత పార్టీకి చెందిన ఆరుగురికి మంత్రిపదవులు కేటాయించారు.
దీంతో హూడా మంత్రివర్గం సంఖ్య సీఎంతో కలుపుకుని 14కు చేరుకుంది. గత ప్రభుత్వంలో 13 మంది మంత్రులకు మాత్రమే స్థానం కల్పించారు. అంతేకాకుండా గత మంత్రివర్గంలోని మంత్రుల్లో ముగ్గురికి కొత్త కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరిలో ఒకరిని స్పీకర్‌గా నియమించారు.