గత ఏడాది నవంబరు 26వ తారీఖున ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో దాడులకు పాల్పడి 50 మంది మరణానికి వందమందికి పైగా తీవ్రగాయాలు పాలవడానికి కారణమైన కసబ్ మరో విషయాన్ని బయటపెట్టాడు. డబ్బుకోసం తన తండ్రి తనను ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అమ్ముకున్నాడని వెల్లడించాడు.
చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని పోషించలేని తన తండ్రి ఈ పనికి పూనుకున్నాడనీ, తండ్రి చెప్పిన మాటకు తాను ఎదురు చెప్పలేదనీ, ఆయన మాటప్రకారం తీవ్రవాద గ్రూపులో చేరిపోయానని తెలిపాడు.
వీధుల్లో కూరగాయలు అమ్ముకుని ఎంతకాలం బ్రతుకు వెళ్లదీస్తామని తన తండ్రి తనను ఒత్తిడి చేసి లష్కరేలో చేర్పించాడని కసబ్ వెల్లడించాడు. తన తండ్రి తనను అమ్ముకున్నందుకు లష్కరే ఎంత డబ్బు ఇచ్చి ఉంటుందో తనకు తెలియదన్నాడు. అయితే తన అనుభవాన్ని బట్టి అది వందల్లోనో లేదంటే మహా అయితే వేలల్లోనో ఉంటుందన్నాడు.
తీవ్రవాద శిబిరానికి వెళ్లినప్పుడు తను ఆ వాతావరణాన్ని చూసి వెనుకంజ వేశానన్నాడు. అయితే లష్కరే అగ్ర నాయకులు తన కుటుంబానికి డబ్బు సహాయం చేస్తామనీ, తన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తామని ఆశపెట్టి ఉగ్రవాద శిక్షణకు తనను సన్నద్ధం చేశారని చెప్పాడు.
ఉగ్రవాద శిబిరంలో చేరిన తర్వాత తనకు మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చారన్నాడు. ఈ శిక్షణాకాలంలో ఒకరికొకరు మాట్లాడుకునేందుకు సైతం భయపడే వాతావరణం అక్కడ నెలకొని ఉంటుందని కసబ్ చెప్పాడు. ఈ వివరాలతో కూడిన ఓ వీడియో ఫూటేజ్‌ను ఆదివారం ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ప్రసారం చేసింది.