ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ట్రాక్‌ను పేల్చివేసిన మావోలు: పట్టాలు తప్పిన రైలు (Maoists | blow up track | eight bogies | derail | Jarkhand)
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులో మరోమారు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సంగ్‌భుమ్ పశ్చిమ జిల్లాలో రైల్వే ట్రాక్‌ను పేల్చి వేశారు. ఫలితంగా టాటా-బిస్లాపూర్ ప్యాసింజర్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఘగ్రా సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
రైలు ఇంజిన్ దాటిన తర్వాత ట్రాక్‌ను పేల్చి వేశారు. దీంతో రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురువారం రాత్రి 9.15 నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకున్నట్టు తెలిపారు.
దీనిపై కేంద్ర రైల్వే శాఖమంత్రి మమతా బెనర్జీ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. మావోయిస్టులు రైల్వే ట్రాక్‌ను పేల్చి వేయడం వల్ల మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతినగా, ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్టు వివరించారు. పరిస్థిని పర్యవేక్షిస్తున్నానని, సీనియర్ రైల్వే అధికారులను కూడా సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు.
అయితే, దెబ్బతిన్న మూడు బోగీల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న సమాచారం. దెబ్బతిన్న ట్రాక్‌ను సరి చేస్తున్నట్టు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.