జార్ఖండ్ రాష్ట్రంలో సుస్థిరత నెలకొనాలంటే... అభివృద్ధి రెట్టింపు వేగంతో సాగాలంటే తమ పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆమె జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ధన్‌బాధ్, ధుమ్‌కాలలో జరిగిన పార్టీ ప్రచార సభల్లో సోనియా పాల్గొని ప్రసంగించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెరపడాలంటే తమ పార్టీతో పాటు.. జేవీఎం-పి పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చారు. దేశంలోనే కాకుండా, రాష్ట్రాల్లో కూడా ఒక్క కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
అదేసమయంలో ఇతర పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీలపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. హింస ద్వారా సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించదని ఆమె మావోయిస్టులను ఉద్దేశించి అన్నారు. అందువల్ల మావోలు ముందుకు వచ్చిన ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆయన పరోక్షంగా విజ్ఞప్తి చేశారు.