అస్సోం రాష్ట్రం మరోమారు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. ఈ రాష్ట్రంలోని నల్బోరి జిల్లాలో ఆదివారం మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు.
లోయర్ అస్సోంలోని నల్బోరి జిల్లాలో నల్బోరి పోలీసు స్టేషన్ సమీపంలో ఉదయం 10.15 నిమిషాల ప్రాంతంలో రెండు పేలుళ్లు సంభవించాయి. ఇదే జిల్లాలోని గోపాల్ బజార్‌లో మూడో పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు. పార్కింగ్ చేసిన సైకిళ్ళలో బాంబులను అమర్చినట్టు గుర్తించారు.
ఈ పేలుళ్ళ వెనుక యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సోం (ఉల్ఫా) తీవ్రవాదుల హస్తం ఉండివుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, పేలుళ్లు జరిగిన నల్బోరి జిల్లా రాష్ట్ర రాజధాని గౌహతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.