జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 700 మంది తీవ్రవాదులు ఉన్నట్టు ఆ రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కుల్దీప్ ఖోడా తెలిపారు. వీరికి నిధులతో పాటు.. ఆయుధాలను పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 700 మంది తీవ్రవాదులు ఉన్నారని చెప్పారు. వీరిలో కొంతమంది గతంలో లొంగిపోయిన వారు కూడా ఉన్నారు. అరెస్టు చేసిన తీవ్రవాదులను తిరిగి వదిలి పెట్టిన తర్వాత వారు తిరిగి తీవ్రవాద తండాల్లోనే కలిసి పోయారని చెప్పారు. అనేక మంది మాజీ సాయుధ మిలిటెంట్లు తిరిగి పూర్వపు విధుల్లోకే చేరారని గుర్తు చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ సరిహద్దులు, నియంత్రణ రేఖల మీదుగా జరిగే చొరబాట్లు చాలా వరకు తగ్గాయన్నారు. శీతాకాలం లేదా మంచు కాలంలో చొలబాటుదార్లను భారత్‌లోకి పంపడమే పాక్‌లోని తీవ్రవాద తండాల ముఖ్య పనిగా ఉందన్నారు. అయితే, మన బలగాలు ఈ చర్యలను సమర్థవంతంగా పలుమార్లు తిప్పికొట్టాయని చెప్పారు.
జేకేలోని తీవ్రవాదులకు హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జీహాదీ ఇస్లామీ, జైషే మొహ్మద్, లష్కర్ తోయిబా వంటి తీవ్రవాద సంస్థల నుంచి పెద్ద ఎత్తున నిధులు, ఆయుధాలు అందుతున్నాయని డీజీపీ తెలిపారు.