ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » లిబెర్హాన్ నివేదిక బహిర్గతం: భాజపా సభ్యుల రభస! (Liberhan report | Babri Masjid | Parliament | Advani | Chidambaram)
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో లిబెర్హాన్ కమిషన్ నివేదిక బహిర్గతం కావడం పట్ల భారతీయ జనతా పార్టీ సభ్యులు తీవ్ర రభస సృష్టించారు. కమిషన్ నివేదిక లీక్ పట్ల ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశమైన వెంటనే భాజపా సభ్యులు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. దీనిపై అద్వానీ కలుగజేసుకుని ఆగ్రహం ప్రసంగించారు. లిబెర్హాన్ కమిషన్‌లోని కొన్ని వాఖ్యాలను మాత్రమే లీక్ కావడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్పష్టంగా ఎంచుకున్న వాఖ్యాలు మాత్రమే ఎలా లీక్ అయ్యాయి, ఎందుకు లీక్ అయ్యాయనే విషయాన్ని తక్షణం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ నివేదిక వివరాలను ప్రచురించిన పత్రికా సంపాదకుడు కూడా తమ సభ్యుడికి కేంద్ర హోంశాఖ వర్గాలే లీక్ చేసినట్టు చెప్పారని అద్వానీ సభలో తెలిపారు. అందువల్ల తక్షణం ఈ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, ఈ కమిటీ నివేదికను ఈరోజే పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టాలని భాజపా సభ్యులు సభలో పట్టుబట్టారు. జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేసిందని వారు ఆరోపించారు.