ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఈ సమావేశాల్లో సభ ముందుకు నివేదిక: చిదంబరం (Liberhan report | Chidambaram | Parliment session | New Delhi | Advani)
బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపిన జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాగే, ఒక ఆంగ్ర వార్తపత్రికలో వచ్చిన కథనం సారాంశంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
లిబర్హాన్ కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు మాత్రమే బయటకు పొక్కాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉభయ సభల్లో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో మంత్రి చిదంబరం జోక్యం చేసుకుని మాట్లాడారు. లిబర్హాన్ కమిషన్ నివేదికను ప్రస్తుత సమావేశాల్లోనే సభ ముందు పెడతామన్నారు.
కాగా, జూన్ 30వ తేదీన కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులోని కొన్ని అంశాలు మీడియాకు బహిర్గతం కావడం దురదృష్టకరమన్నారు. అయితే, నివేదికకు సంబంధించి ప్రధాన కాపీ భద్రంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా, దీనికి సంబంధించి తమ మంత్రిత్వ శాఖకు చెందిన ఏ ఒక్కరు కూడా ఎవరితోనూ మాట్లాడలేదనే విషయాన్ని స్పష్టం చేయగలను అని సభకు చెప్పారు.
కాగా, ఆంగ్లపత్రిక ప్రచురించిన కథనంలో.. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం మాజీ ప్రధాని వాజ్‌పేయితో సహా అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు ముందుగానే తెలిసినప్పటికీ.. వారు తెలియనట్టుగా ఉన్నారని పేర్కొంది. దీనిపై అద్వానీ తీవ్రంగా మండిపడ్డారు.