ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రైళ్ల ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. శనివారం ఒక్కరోజే మూడు రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పదికి చేరుకుంది. మరో 15 మంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
భివానీ-గోరఖ్‌పూర్ మధ్య తిరిగే గోరఖ్‌దామ్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ జిల్లాలోలని పాంకీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలతో సహా పది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.
అలాగే, సీతామారహీ లిచ్ఛావీ ఎక్స్‌ప్రెస్ రైలును మగధ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న మరో ప్రమాదంలో లిచ్ఛావీ ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రెండు ప్రమాదాల నుంచి తేరుకోక ముందే సరయు ఎక్స్‌ప్రెస్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ మూడు ప్రమాదాల్లో పది మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీ-కాన్పూర్ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది.