తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు బ్లాక్ మెయిలింగ్‌కు కేంద్ర హోం మంత్రి చిదంబరం తలొగ్గారని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పరివార్ తన అధికార పత్రికలో పేర్కొంది.
అయితే చిన్న రాష్ట్రాల విషయంలో కేంద్రంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగువేయాల్సి వుందని, లేని పక్షంలో దేశంలో చిన్న రాష్ట్రాల సంఖ్య పెరిగి రాజకీయ సుస్థిరత, దేశ భద్రత, ఆర్థికాభివృద్ధికి భంగం వాటిల్లగలదని ఆర్ఎస్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు.
నిరశన దీక్ష విషయంలో మహాత్మాగాంధీ పాటించిన సూత్రాలను అపహాస్యం చేసే విధంగా కేసీఆర్ వ్యవహరించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అనేక లాభనష్టాలున్నాయి. సమైక్యాంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన పక్షంలో తగ్గిపోయే ఆర్థికవనరుల ప్రభావం అభివృద్ధిపై తీవ్రస్థాయిలో ఉంటుంది.
చాలాకాలం నుంచి నక్సల్స్ స్థావరంగా ఉన్న తెలంగాణలో శాంతి భద్రతలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాలకు అతీతంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరగాల్సి ఉందని సంఘ్ స్పష్టం చేసింది. దేశప్రగతికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరమమని భావించిన పక్షంలో ఏ దిశలో ప్రక్రియ జరగాలన్న విషయమై జాతీయస్థాయిలో చర్చ జరగాలని సంఘ్ సూచించింది.