బీహార్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్కారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన రెండు రోజుల రాష్ట్ర పర్యటన మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఇకపై జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఇకపోతే.. రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అమలు చేయడం లేదన్నారు. ప్రధానంగా, ఉపాధి హామీ వంటి సంక్షేమ పథకాల అమలులో నితీష్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ పథకం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో 20-30 శాతం నిధులు దళారీల చేతుల్లోకి చేరుతున్నాయని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి బీహార్‌కు తగినంతగా సాయం అందడం లేదన్న విమర్శకు బదులిస్తూ ఎన్.డి.ఏ. హయాంలో బీహార్‌కు రూ.50 వేల కోట్లను కేటాయించారని, అదే యూపీఏ హయాంలో రూ.96 వేల కోట్లను కేటాయించామని రాహుల్ అన్నారు.
ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, అస్సోం, రాజస్థాన్ ప్రభుత్వాలను ప్రశంసించారు. అధిక ధరల సమస్యపై ప్రధాని మన్మోహన్‌తో తాను మాట్లాడానని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరుతున్న యువతతో భవిష్యత్తులో బీహార్ ముఖచిత్రం మారిపోవడం ఖాయమని రాహుల్ జోస్యం చెప్పారు.