ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు, అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు జస్టీస్ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని, అందువల్ల ప్రతి ఒక్కరూ కేంద్రానికి సహకరించాలని కేంద్ర న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం విజ్ఞప్తి చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు.
వీరిద్దరు తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నిపుణుల కమిటీని వేసిందన్నారు. అందువల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ విన్నవించారు.
రాష్ట్రంలో పరిపాలన సజావుగా కొనసాగేలా రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. పరిపాలన సజావుగా కొనసాగకపోతే అభివృద్ధి కుంటుబడి పోతుందని మొయిలీ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ఆందోళనలను వదిలిపెట్టి భవిష్యత్‌పై దృష్టి సారించాలని మొయిలీ హితవు పలికారు.