ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మార్చి 12న రామ్‌లీలా మైదానంలో లెఫ్ట్ భారీ సభ! (Ramleela Ground | Delhi | Left parties | Price rates | Moists)
దేశ ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 12వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీస్థాయిలో బహిరంగ సభను నిర్వహించాలని లెఫ్ట్ పార్టీల నిర్ణయించాయి. సీపీఎం, సీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్, ఆరెస్పీ తదితర వామపక్షాలు ఇందులో భాగస్వాములు కానున్నాయి.
ముఖ్యంగా నిత్యావసరాల ధరల పెరుగుదలను నియంత్రించి ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, అధిక పంటలు పండించేందుకు రైతులకు సాయం చేయాలని, భూ సంస్కరణలు అమలు చేసి రైతులు, గిరిజనులకు చెందిన భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే, అందరికీ ఉద్యోగాలు కల్పించాలని, బెంగాల్‌లో తృణమూల్, మావోయిస్టుల కూటమి చేస్తున్న అరాచకానికి తెరదించి ప్రజాతంత్ర హక్కులను పరిరక్షించాలన్న డిమాండ్లతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వామపక్ష నేతలు ప్రకాశ్ కారత్, ఏబీ.బర్దన్‌లు వెల్లడించారు.
నిత్యావసర వస్తు ధరలను అరికట్టడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తులు తగ్గినప్పటికీ... పలు ఆహారధాన్యాలను కేంద్రం ఎగుమతి చేసిందన్నారు. ఫలితంగా నిత్యావసర వస్తు ధరలకు గిరాకీ పెరిగి, ధరలు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు.