ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బాయ్‌కట్ చేస్తే.. వారి గోతి వారు తవ్వుకున్నట్టే: మొయిలీ (Boycutt | Moily | Telangana | Assembly | Congress | High command | Rosaiah)
బాయ్‌కట్ చేస్తే.. వారి గోతి వారు తవ్వుకున్నట్టే: మొయిలీ
బుధవారం, 10 ఫిబ్రవరి 2010( 09:43 IST )
File
FILE
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ విధి విధానాల వెల్లడిలో జాప్యం జరగడాన్ని సహించేది లేదని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ విధి విధానాలు త్వరగా ప్రకటించకుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కట్ చేస్తామని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు చేసిన హెచ్చరికలను అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందన్నారు.
ఈ అంశంపై ఆయనను సంప్రదించగా, బడ్జెట్ సమావేశాలు బాయ్‌కట్ చేయాలని భావిస్తే.. వారి గోతి వారు తవ్వుకున్నట్టేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రోశయ్య కూడా తీవ్రంగానే స్పందించారు. రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నింటినీ అధిష్టానం చూస్తోందని, కఠిన నిర్ణయాలకు కూడా వెనుకంజ వేయదని ఆయన పరోక్షంగా తెలంగాణ ప్రాంత నేతలను హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో మంత్రి మొయిలీ చేసిన వ్యాఖ్యలు అధిష్టానం వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని, వాటిని రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణకు అనుకూలంగా లేకుంటే శాసన సభ సమావేశాలు బాయికాట్ చేస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయడం సబబు కాదన్నారు.
ఒక వేళ వారి ఇష్ట ప్రకారంగా వారు చేసుకుంటే.. భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అలాగే, కమిటీ పరిశీలనాంశాలు వీలున్నంత త్వరగా ప్రకటించే అవకాశాలు ఉందన్నారు. తన అధ్యక్షతన అధిష్టానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ రాష్ట్ర కాంగ్రెస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా మాత్రమే పని చేస్తుందని చెప్పారు.