ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉస్మానియా ఘటనపై త్రిసభ్య కమిటీకి సుప్రీం ఆదేశం (Osmania | Three member Committee | Telangana | Hyd | Supreme)
రాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనలపై పూర్తి నివేదిక ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, ఓయూలో బలగాల మొహరింపు కూడా ఈ కమిటీ సూచన మేరకే జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, ఓయూ ఘటనపై దాఖలైన పిటీషన్‌ను విచారించిన సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలావుండగా, త్రిసభ్య కమిటీలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శితో పాటు విశ్వవిద్యాలయ ఉపకులపతి, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌లతో ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. క్యాంపస్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ తెలియజేయాలని కోరింది.
అంతేకాకుండా, ఓయూలో అదనపు బలగాల మొహరింపుపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరింది. ఇకపై త్రిసభ్య కమిటీ సూచన మేరకే బలగాలను మొహరించాలని కోరింది. అదేసమయంలో ప్రస్తుతం బలగాల మొహరింపు ప్రక్రియ యధాతథంగా ఉంటుందని సుప్రీం తేల్చి చెప్పింది.