ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » విమర్శలు బేఖాతర్: మాయావతికి మరో రూ.నోట్ల దండ (Mayawati | BSP | 2nd garland | Lucknow | PWD Minister | Criticism)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాల్లో ఆమెకు బహుకరించిన వెయ్యి రూపాయిల నోట్ల దండపై దేశ వ్యాప్తంగా చర్చతో పాటు.. విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిల్లో బుధవారం మరో నోట్ల దండను ఆ పార్టీ నేతలు బహుకరించారు. ఈ దండలో 18 లక్షల రూపాయల విలువచేసే నోట్లను పొందుపరిచారు.
దీనిపై ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖామంత్రి నస్రిద్దీన్ సిద్ధిక్యూ పార్టీ నేతలతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత్రికి ఇలాంటి పార్టీ నోట్ల దండలను బహుకరించడం జరుగుతుందన్నారు. దీన్ని కొనసాగించేందుకు పార్టీ కార్యకర్తలకు పార్టీ అధినేత్రి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ నోట్ల దండను పార్టీ కార్యకర్తలు, నేతలు ఇచ్చిన విరాళాలతో తయారు చేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన 18 యూనిట్లు లక్షరూపాయల చొప్పున బహుకరించాయన్నారు. ఈ డబ్బుతోనే నోట్ల మాలను తయారు చేసి అధినేత్రికి బహుకరించినట్టు చెప్పారు.
అయితే, దీనిపై మీడియా అతిగా ప్రచారం చేయడాన్ని తప్పుబట్టిన ఆయన.. మరోరకంగా తమ పార్టీకి మంచి ప్రచారం చేసిపెట్టాయని కితాబిచ్చారు. మాయావతికి మొదట వేసిన నోట్ల దండను రూ.21 లక్షల నోట్లతో తయారు చేసినట్టు సిద్ధిక్యూ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.