ఇన్నాళ్లూ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న కర్నాటక మంత్రులు, గాలి సోదరులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాక్ ఇచ్చారు. గురువారం నుంచి కర్నాటక పోర్టుల ద్వారా ఇనుప ఖనిజ ఎగుమతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా గాలి సోదరులు అక్రమంగా గనుల తవ్వకాలను చేపట్టి సంపదను కొల్లగొడుతున్నా యడ్యూరప్ప చేష్టలుడిగి చూస్తున్నారని గత కొంతకాలంగా కర్నాటక ప్రతిపక్షాలన్నీ ఆయనపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మైనింగ్ అక్రమాలను నిర్మూలించాలంటూ ప్రతిపక్షాలు పాదయాత్రను కూడా ప్రారంభించాయి.
దీంతో యడ్యూరప్పపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. గత వారం ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విదేశాలకు ఇనుప ఖనిజాల ఎగుమతులను నిషేధించాలని కోరారు. అక్రమ రవాణాను అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని ఆయన ప్రధానికి సూచించారు. అంతేకాక దేశానికి ఉపయోగపడాల్సిన సహజ వనరులు ఇతర దేశాలకు తరలి వెళ్లడంపై కర్నాటక ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా గురువారం నుంచి మంగుళూరు పోర్టు మినహా కర్నాటకలోని మిగిలిన అన్ని పోర్టుల ద్వారా ఇనుప ఖనిజ రవాణాను నిలిపివేయాలని యడ్యూరప్ప సర్కార్ ఆదేశించింది. ఇనుప ఖనిజ రవాణా నిషేధం నిర్ణయాన్ని యడ్యూరప్ప సమర్థించుకున్నారు. దీని ద్వారానే అక్రమ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకునే వీలుందన్నారు. మరి "గాలి" సోదరులు యడ్యూరప్పకు ఎలాంటి షాక్ ఇస్తారో చూడాలి.