ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఈ దేశానికి గుజరాత్ శత్రువా: కేంద్రానికి మోడీ ప్రశ్న! (Sohrabuddin encounter case | Modi | blasts | Centre | CBI | Gujarat | Congress)
ఈ దేశానికి గుజరాత్ శత్రువా: కేంద్రానికి మోడీ ప్రశ్న!
సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని కేంద్ర పరిశోధనా సంస్థ (సీబీఐ) కోరనున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ కేసును తమ రాష్ట్రం నుంచి బదిలీ చేస్తే.. అది తమ రాష్ట్ర న్యాయవ్యవస్థనే కించపరిచినట్టని ఆయన అన్నారు. అంతేకాకుండా, దేశంలో అంతర్భాగమైన గుజరాత్.. ఈ దేశానికి శత్రువా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. గుజరాత్ భారతావనిలో ఒక అంతర్భాగంగా మీరు గుర్తించడం లేదా అని అడిగారు.
సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో తనను కూడా సీబీఐ విచారించ వచ్చని మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ నకిలీ ఎన్‌కౌంటర్ కేసుతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గుజరాత్‌లో ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యంగా, కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలనే భావన రావడం తమ రాష్ట్ర న్యాయ వ్యవస్థను కించపరిచినట్టేనని చెప్పుకొచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా తనను లక్ష్యంగా చేసుకున్నారని, ఇపుడు రాష్ట్ర న్యాయ వ్యసస్థపై దృష్టి పెట్టారని మోడీ మండిపడ్డారు.