ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్ ప్రభుత్వానికి ముగిసిన మావోయిస్టుల డెడ్‌లైన్ (Maoists deadline | Abducted | Bihar | Cops ends | Patna | National | Kidnap)
బీహార్ ప్రభుత్వానికి ముగిసిన మావోయిస్టుల డెడ్‌లైన్
బీహార్ ప్రభుత్వానికి మావోయిస్టులు విధించిన 48 గంటల గడువు బుధవారం సాయంత్రం నాలుగు గంటలతో ముగిసింది. మావోయిస్టుల బందీలుగా ఉన్న నలుగురు పోలీసుల పరిస్థితి ఏమిటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీహార్ పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది అనుచరులను విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో నక్సలైట్లు ఇద్దరు ఎస్‌ఐలతో సహా నలుగురు పోలీసులను కిడ్నాప్ చేసి బందీలుగా ఉంచుకున్నారు. ఎనిమిది మంది అనుచరులను విడుదల చేయకుంటే బందీలుగా ఉన్న పోలీసులను హత్య చేస్తామని మావోయిలు బీహార్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.
ఈ నేపథ్యంలో గడువు బుధవారం నాలుగు గంటలకు ముగిసిపోయింది. అయితే ఇటు బీహార్ ప్రభుత్వం మావోల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే, బందీలుగా ఉన్న పోలీసుల పరిస్థితిపై మావోలు వైపు నుంచి సమాచారం లేదు. ఫలితంగా పోలీసుల కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
ఈ అంశంపై మావోయిస్టు ప్రతినిధి అవినాష్ స్థానిక హిందీ ఛానల్‌తో మాట్లాడుతూ తాము విధించిన డెడ్‌లైన్‌ను గురువారం ఉదయం వరకు పొడగించినట్టు చెప్పారు. బందీలుగా ఉన్న పోలీసుల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టుల షరతులకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చి చెప్పింది. అయితే, మావోలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.