ఆ ముగ్గురినైనా ప్రాణాలతో విడిచిపెట్టండి: శిబూ సోరెన్
బీహార్‌లో మావోయిస్టులు పోలీసును హతమార్చడాన్ని జేఎంఎం చీఫ్ శిబూ సోరెన్ ఖండించారు. తమ చేతుల్లో బందీలుగా ఉన్న మిగిలిన ముగ్గురు పోలీసులకు ఎటువంటి హాని తలపెట్టకుండా భేషరతుగా విడుదల చేయాలని కోరారు.
నక్సలైట్ల చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నాననీ, చెరబట్టిన నలుగురు పోలీసుల్లో ఒకరిని హతమార్చడం దిగ్భ్రాంతి కలిగించిందని సోరెన్ తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రితో తాను మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తాననీ, బందీలుగా ఉన్న ముగ్గురు పోలీసులను విడిచిపెట్టాలని అభ్యర్థించారు.
చర్చల ద్వారా పరిష్కారం కానటువంటి సమస్యే ఉండదని సోరెన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు బీహార్ సీఎం తన స్వగృహానికి గట్టి భద్రతను ఏర్పాటు చేసుకోవడంపై ఆర్జేడీ చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. పోలీసుల ప్రాణాలను కాపాడటంలో విఫలమైన నితీష్ తన భద్రతకే ప్రాముఖ్యతను ఇస్తూ అధికారుల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారని దుయ్యబట్టారు.