ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్‌లో ఇద్దరు మావోల అరెస్టు: వేడెక్కిన రాష్ట్రం! (Bihar | Maoists | Kidnap | Police | National | Nitish Kumar)
బీహార్‌లో ఇద్దరు మావోల అరెస్టు: వేడెక్కిన రాష్ట్రం!
బీహార్ రాష్ట్ర పోలీసులు తాజాగా ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అదేసమయంలో తమ రాష్ట్రానికి అదనంగా మరో నాలుగు వేల మంది పారామిలిటరీ బలగాలను పంపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. తక్షణం ఆ బలగాలను పంపేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు మావోయిస్టులు కిడ్నాప్ చేసిన పోలీసు అధికారుల జాడ తెలుసుకునేందుకు సహాయంగా ఒక హెలీకాప్టర్‌ను కూడా పంపుతున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఫలితంగా. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన కిడ్నాప్‌కు గురైన పోలీసు కుటుంబ సభ్యుల మధ్య నెలకొంది.
గత ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్, అనంతరం పోలీసులను మావోలు కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే. జైళ్ళలో మగ్గుతున్న ఎనిమిది మంది సహచరులను విడుదల చేయాలని లేనిపక్షంలో తమ వద్ద బందీలుగా ఉన్న వారిని హతమార్చుతామని మావోలు హెచ్చరించారు.
ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటల వరకు గడువు విధించారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించక పోవడంతో ఒక ఎస్సైను మావోలు హతమార్చారు. దీంతో బీహార్ ఒక్కసారి వేడెక్కింది.
ఇదిలావుడంగా, మావోలు హతమార్చిన బీహార్ మిలిటరీ పోలీసు (బిఎంపి) అధికారి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోడ్డు పక్క పడివున్న ఈ అధికారి లూకాస్ టెటె మృతదేహంగా గుర్తించారు. బుల్లెట్ గాయాలతో ఛిద్రమై ఉన్నట్లు లఖీసరారు ఎస్‌పి రంజిత్‌కుమార్ మిశ్రా చెప్పారు.
మిగిలిన బంధితులను సురక్షితంగా విడిపించేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. తమ షరతులకు తలొగ్గకుంటే మిగిలిన వారిని కూడా హతమార్చుతామని మావోయిస్టులు హెచ్చరించారు.