ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేడు బీహార్ సీఎం నితీష్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ! (Bihar | CM | Maoists | Nitish Kumar | All party meet | Kidnap | Home Ministry)
మావోయిస్టుల చెరలో ప్రాణాలతో ఉన్న మిగిలిన పోలీసులను సురక్షితంగా రక్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా హింసకు తెరదించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీహార్ జైళ్లలో ఉన్న తమ సహచరులు జైపాశ్వాన్, విజరు చౌరసియా, ప్రేమ్ భుయాన్, ప్రమోద్ బర్నవాల్, రామ్‌విలాస్ తంతి, రమేష్ తిర్కి, అర్జున్ కోడా, రత్తు కోడాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు రూపేష్ కుమార్, యాదవ్, బిఎంపి హవల్దార్ ఎతేశామ్ ఖాన్, బిఎంపి ఎఎస్‌ఐ టెటెలను గత ఆదివారం కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే.
మావోలు విధించిన గడువు ముగియడంతో ఇద్దరు పోలీసు అధికారులను హతమార్చారు. ఇదే సమయంలో నక్సలైట్ల కిడ్నాప్ వ్యవహారాన్ని సక్రమంగా ఎదుర్కోవడంలో బీహార్ సర్కారు విఫలమైనట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ శనివారం సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు.
ఇదిలావుండగా, మావోయిస్టుల హింసను ఎదుర్కొనే విషయంలో తాము బీహార్ సర్కారుకు పూర్తిగా అండగా నిలుస్తామని కేంద్ర హోంశాఖ (నక్సల్స్ వ్యవహారాల) జాయింట్ సెక్రెటరీ కాశ్మీర్‌సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రం కోరే సహాయాన్ని అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నట్టు ఆయన న్యూఢిల్లీలో వెల్లడించారు.