తన భర్తతో పాటు బందీలుగా ఉన్న మిగిలిన వారిని సురక్షితంగా విడిపించడంలో పోలీసులు విఫలమైతే తాను కూడా నక్సలైట్లలో చేరాల్సి వస్తుందని బీహార్ మావోయిస్టులు కిడ్నాప్ చేసిన పోలీసుల్లో ఒకరైన అభయ్ యాదవ్ భార్య రజనీ యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తన భర్తకు ఏదన్నా జరిగితే తాను కూడా నక్సల్స్ ఉద్యమంలో పాల్గొని తూపాకీ చేత పట్టాల్సి వస్తుందని ఆమె చెప్పారు.
కిడ్నాప్ అయిన నలుగురి పోలీసుల్లో శుక్రవారం ఏఎస్ఐ లూకస్‌ను చంపివేసిన సంగతి తెలిసిందే. దీంతో తన భర్తకు ఏంజరుగుతుందో అని ఆవేదన చెందిన రజనీ.. ప్రభుత్వం తన భర్తను సురక్షితంగా విడిపించలేని పక్షంలో తమ కుటుంబం మొత్తం ఉద్యమబాట పట్టి తుపాకీ చేతపడతామని ప్రభుత్వాన్ని బెదిరించింది.
ఇదిలా ఉంటే.. మావోయిస్టుల చెరలో ప్రాణాలతో ఉన్న మిగిలిన పోలీసులను సురక్షితంగా రక్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని మావోయిస్టులు తమతో చర్చలు జరిపేందుకు రావాలని ఆయన కోరారు.
బీహార్ జైళ్లలో ఉన్న తమ సహచరులు జైపాశ్వాన్, విజరు చౌరసియా, ప్రేమ్ భుయాన్, ప్రమోద్ బర్నవాల్, రామ్‌విలాస్ తంతి, రమేష్ తిర్కి, అర్జున్ కోడా, రత్తు కోడాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు గత ఆదివారం నలుగురు పోలీసు అధికారులను కిడ్నాప్ చేసిన విషయం తెల్సిందే.