ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బందీలుగా ఉన్న పోలీసులను వదిలేసిన మావోలు! (Bihar, Hostage crisis, Abducted policemen released, National, Lakhisarai)
బందీలుగా ఉన్న పోలీసులకు విముక్తి మావోయిస్టులు ప్రాణభిక్ష పెట్టారు. మొత్తం నలుగురు పోలీసులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. ఒకరిని హతమార్చిన విషయం తెల్సిందే. మిగిలిన ముగ్గురిని ప్రాణాలతో విడిచి పెడితే చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు బీహార్ సర్కారు ప్రకటించింది.
అయితే, ఈ చర్చల ప్రతిపాదనను తోసిపుచ్చిన మావోయిస్టులు.. మిగిలిన పోలీసులను మాత్రం సోమవారం ఉదయం ప్రాణాలతో సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ ముగ్గురిని లఖిసరాయ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎలాంటి షరతులు లేకుండా వదిలివేశారు. దీంతో తొమ్మిది రోజుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది.
రాష్ట్ర రాజధాని పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛనాన్-కజ్రా సరిహద్దు ప్రాంతాల్లోని సిమ్రా రాయ్ వద్ద గల దట్టమైన అటవీ కొండ ప్రాంతంలో ఎస్ఐలు అభయ్ ప్రసాద్ యాదవ్, రూపేష్ కుమార్ సిన్హా, బీహార్ మిలిటరీ పోలీసు హవల్దార్ ఎష్వాన్ ఖాన్‌లను వదిలి వేశారు. ఇదే ప్రాంతంలోనే హతమార్చిన ఎస్ఐ మృతదేహాన్ని కూడా మావోయిస్టులు గత శుక్రవారం ఉదయం వదిలి వేసి వెళ్లారు.
ఈ విషయంపై ఆ రాష్ట్ర డీజీపీ నీల్మణి మాట్లాడుతూ.. బందీలుగా ఉన్న ముగ్గురు పోలీసులను మావోయిస్టులు సురక్షితంగా వడిచిపెట్టారని చెప్పారు. వీరిని లఖిసరాయ్ పట్టణ పోలీసు స్టేషన్‌కు ఆ జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ మిశ్రా తీసుకెళ్లి ఆ తర్వాత ఇంటికి పంపించి వేశారని తెలిపారు.