ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భగవంతుని దయవలనే బతికి బయటపడ్డాను: రూపేష్ (I am alive | Because of gods grace | Rupesh Kumar | Maoists | Kidnap)
"ఆ భగవంతుని దయవలనే నేను ఈ రోజు బతికి బయటపడ్డాను, నా తల్లిదండ్రులు, కుటుంబం దీవెనల ఫలితంగా నేను క్షేమంగా ఇంటికి చేరగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది" అని మావోయిస్టుల చెర నుంచి క్షేమంగా బయటపడిన ముగ్గురు బీహార్ పోలీసుల్లో ఒకరైన ఎస్సై రూపేష్ కుమార్ సిన్హా తెలిపారు.
ఇదే విధంగా మరో ఎస్సై అభయ్ ప్రసాద్ భార్య రజని దేవి కూడా ఉద్వేగంతో మాట్లాడుతూ.. "భగవంతుడు నా ప్రార్ధనలు ఆలకించాడు, ఆయనకు ధన్యవాదాలు. నా భర్తను విడిచిపెట్టినందుకు మావోయిస్టు అన్నలకు కూడా ధన్యవాదాలు. నా భర్త రాక కోసం ఎంతో నిరాశతో ఎదురు చూశాను.
ఈ విషయంలో నా భర్తను తన సొంత బిడ్డగా భావించిన బీహార్ ప్రభుత్వానికి, మా గ్రామం, నా పిల్లల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. నేను బతికున్నంత కాలం మావోయిస్టు అన్నలకు రుణపడి ఉంటాను" అని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ అంశంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ... బందీలుగా ఉన్న పోలీసులను మావోయిస్టులు విడిచిపెట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ ముగ్గురిని వారి వారి ఇళ్లకు పంపించామని చెప్పారు. మరో పోలీస్ లూకస్ టెటేను చంపడం మాత్రం బీహార్ ప్రభుత్వం తిరస్కరిస్తుందని ఆయన అన్నారు.