దేశంలో ప్రశాంతంగా సాగుతున్న బంద్: రూ.కోట్లు నష్టం!
నిత్యావసరవస్తు ధరల పెరుగుదల, కార్మిక చట్టాల ఉల్లంఘన, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తదితర చర్యలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మె వల్ల ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది.
24 గంటల బంద్ కారణంగా కోట్లాది రూపాయల మేరకు నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, చెన్నయ్, హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ బంద్ వామపక్ష పాలిత రాష్ట్రాల్లో సంపూర్ణంగా కొనసాగుతుండగా, మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం పాక్షికంగా ఉంది. ప్రజా రవాణాకు ఎలాంటి ఆటంకం కలుగక పోయినప్పటికీ.. విమానసర్వీసులు, ప్రభుత్వ సేవలు అటంకం కలుగగా, పారిశ్రామిక ఉత్పత్తి పూర్తిగా స్తంభించి పోయింది. బ్యాంకు సేవలు ఆటంకం కలిగింది.
దేశ వ్యాప్తంగా సుమారు వంద విమాన సర్వీసులు రద్దు అయినట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా స్వదేశీ, విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకులోనై, ఎయిర్‌పోర్టుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
ఈ సమ్మెను ఏఐసీసీటీయు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంకేజీ, యూటీయూసీలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు.. సంఘటిత అసంఘటిత కార్మిక విభాగాలు, యూనియన్లు కూడా తమవంతు మద్దతును ప్రకటించాయి.