ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాజస్థాన్‌లో వైద్యుల సమ్మె: 50 మంది రోగుల మృతి (Rajasthan | Lives lost | Doctors strike | Jaipur | Lathicharge | Jodhpur)
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో విషమ పరిస్థితి నెలకొంది. జోధ్‌పూర్‌లో తమ సహచరునిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడానికి నిరసనగా రెసిడెంట్స్ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో సుమారు 1,200 మంది డాక్టర్లు పాల్గొన్నారు. దీంతో ఐదు ప్రధాన జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా ఇప్పటి వరకు యాభై మంది రోగులు మృత్యువాత పడ్డారు.
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌తో పాటు జోధ్‌పూర్‌లలో వైద్యసేవలు పూర్తిగా ఆగిపోయాయి. గత మూడు రోజులుగా ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీటితో పాటు ఓపీ వైద్య సేవలకు కూడా పూర్తిగా విఘాతం కలిగింది. అయితే ఇన్‌పేషంట్ల పట్ల వైద్యులు కరుణ చూపి అరకొరగా వైద్యం అందిస్తుండటంతో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
దీనిపై ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ సమస్యపై దృష్టిసారించాం. పలువురు రోగులు మృతి చెందినట్టు విన్నాం. వీటిని నిర్ధారించుకునే పనిలో ఉన్నాం. వీటిపై ఇపుడే వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుందన్నారు. ఎండీఎం వైద్య కలాశాల వద్ద పోలీసులు సాగించిన దమనకాండకు నిరసనగా గత శనివారం నుంచి రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెకు దిగిన విషయం తెల్సిందే.
జైపూర్, కోటా, అజ్మీర్, బైకనీర్ తదితర ప్రాంతాల్లో రెసిడెంట్ వైద్యులు విధులను పూర్తిగా నిలిపి వేశారు. అలాగే, మెడికల్ విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన సీనియర్ పోలీసులు, ఇతర అధికారులపై చర్య తీసుకోవాలని సుమారు 40 ఆస్పత్రులకు చెందిన ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.