ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » వ్యవసాయ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలి: రాహుల్‌కు ప్రశ్న! (Separate budget | Agriculture | Students | Rahul | Vidarbha | Farmers sucides)
వ్యవసాయ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలి: రాహుల్‌కు ప్రశ్న!
దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే రైల్వే వార్షిక బడ్జెట్ తరహాలో వ్యవసాయ రంగానికి కూడా ప్రత్యేక వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేయాలని పలువురు విద్యార్థులు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఒకరోజు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం విదర్భ రీజియన్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పంజాబ్‌రావు దేశ్‌ముఖ్ క్రిషీ విద్యాపీఠానికి చెందిన 400 మంది విద్యార్థులతో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ముక్తకంఠంతో వ్యవసాయ శాఖకు ప్రత్యేక వార్షిక బడ్జెట్ కావాలని డిమాండ్ చేశారు.
దీనికి రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. భారతీయ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ అని, అందువల్లే ఆ శాఖ వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేస్తోందన్నారు. అదేసమయంలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం మరిన్ని నిధులను కేటాయిస్తోందన్నారు.
అలాగే, పల్లె ప్రాంతాల్లోని వాసులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అపుడే పట్టణాలకు గ్రామవాసుల వలసలను నిరోధించవచ్చని అభిప్రాయపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం అనేది దురదృష్టకర సంఘటనగా రాహుల్ అభివర్ణించారు.