ఈ సారి జార్ఖండ్‌కు కొత్త ముఖ్య మంత్రి అర్జున్ ముండానా?
గత మూడు నెలల క్రితం జార్ఖండ్ ముక్తి మోర్చాతో (జెఎంఎం) విభేదించి విడిపోయిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ అధినేత శిబూ సోరెన్‌కు దగ్గరయ్యింది. రెండు పార్టీలూ చేతులు కలిపాయి. జెఎంఎం మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి ముందుకు రావడంతో రాష్టప్రతి పాలన ఎత్తివేయాలని గవర్నర్ ఎం.ఒ.హెచ్ ఫరూక్ కేంద్రానికి సిఫారసు చేశారు.
బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ‘బేషరతు’ మద్దతు ఇస్తున్నట్లు జెఎంఎం ప్రకటించింది. జెఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఈ విషయం తెలిపారు. దీంతో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండాను బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకుంది. అనంతరం అర్జున్ ముండా జార్ఖండ్ గవర్నర్ ఎం.ఒ.హెచ్ ఫరూక్ కలిసి తనకు 45 మంది శాసస సభ్యుల మద్దతుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని తెలిపారు.
గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలో బిజెపికి చెందిన వారు 18 మంది, జెఎంఎంకు చెందిన వారు 18 మంది, జెడియుకు చెందిన వారు ఇద్దరు, ఎజెఎస్‌యుకు చెందిన వారు ఐదుగురు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు చమ్ర లిండా, బిదేశ్ సింగ్ ఉన్నారు. జార్ఖండ్‌లో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 81.
అయితే గవర్నర్ మాత్రం అర్జున్ ముండా ప్రతిపాదనను పరిశీలించి, పార్టీకి తన నిర్ణయాన్ని తెలియజేస్తానని చెప్పారు. గవర్నర్ నివేదిక అందిన తర్వాత రాష్ట్రంలో రాష్టప్రతి పాలన ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావచ్చని, ప్రభుత్వం ఏర్పాటులో జోక్యం చేసుకోననీ కేంద్రం ప్రకటించింది. కాగా.. ఈ లోపే జార్ఖండ్‌కు కొత్త సిఎం పదవిని అర్జున్ ముండా చేపట్టవచ్చని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.