దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలను చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం సమ్మతించిన విషయం తెల్సిందే. అయితే, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రెండు వేల కోట్ల రూపాయల వరకు భారం పడనుంది. దేశంలో ఇప్పటికే జనాభా లెక్కలు ప్రారంభమైన విషయం తెల్సిందే. వివిధ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి మేరకు కుల ప్రాతిపదికన జనాభా లెక్కలను సేకరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఈ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి మొదలవుతుంది. ఈ కుల గణన జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇది వచ్చే ఏడాది జూన్‌లో మొదలై, సెప్టెంబర్‌లో ముగుస్తుందని కేంద్రం వెల్లడించింది.
కులగణన జరిపే సమయంలో దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలుగకుండా కుల గణన చేపడుతామని కేంద్ర హోంశాఖా మంత్రి పి.చిదంబరం కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు.