జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు జేఎంఎంతో భారతీయ జనతా పార్టీ జతకట్టడంపై ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అందువల్ల ఈనెల 11వ తేదీన జరుగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అద్వానీ గైర్హాజరు కావాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఈ పొత్తును అద్వానీతో పాటు ఇతర సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు సైతం విమర్శించినట్టు వినికిడి. అయితే, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీతో పాటు మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌లు మాత్రం ఈ పొత్తును గట్టిగా సమర్థిస్తున్నారు.
కాగా, భాజపా-జేఎంఎంల మధ్య తాజాగా కుదిరిన అవగాహనతో ఇరు పార్టీలు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో గవర్నర్ ఎంఓహెచ్.ఫరూక్ ఆహ్వానం మేరకు అర్జున్ ముండా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఫలితంగా జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మూడో సారి ప్రమాణం చేయనున్నారు.
42 సంవత్సరాల అర్జున్ ముండా ప్రస్తుతం జెంషెడ్‌పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. శనివారం 11 గంటలకు ఆ రాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి జేఎంఎం శాసనసభానేత హేమంత్ సొరేన్, ఆల్ జార్ఖండ్ స్టూడెండ్స్ యూనియన్ అధ్యక్షుడు సుదీష్ మహాతోలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.